HI WELCOME TO KANSIRIS

మన్నెంలో మొనగాడు

Leave a Comment
‘ఓసోస్‌... స్ట్రాబెర్రీ అయితే ఏటి... మిరియాలయితే ఏటి
పండించే ఇదానం తెలియాలిగానీ..’ అంటాడు బౌడు కుశలవుడు. అనడమే కాదు చేసి చూపించి.. అందరితో శభాష్‌ అనిపించుకున్నాడు. చదివింది పదో తరగతే అయినా శాస్త్రవేత్తలకూ విత్తనాలు ఇచ్చేంత దిట్టగా మారాడు. కుశలవుడు చేసిన అద్భుతాలు చూస్తే మనలాంటోళ్లు  ఇతను మామూలోడు కాదెహె.. ‘మన్యం మొనగాడు’ అనాల్సిందే! ఇంతకీ అతను చేసిన ఆ అద్భుతాలు ఏంటో తెలుసుకుందామా?

స్ట్రాబెర్రీలను చూస్తే ఇప్పటికీ మనకొక అభిప్రాయం ఉంటుంది. అవి నగరాల్లోనే ఉంటాయి అందరికీ అందుబాటులో ఉండవు.. బోలెడు ఖరీదని. అలాంటి నమ్మకాన్ని కుశలవుడు చాలా తేలిగ్గా బ్రేక్‌ చేసేశారు. స్ట్రాబెర్రీ పంట పండించి లాభాలు గడించాడు. ఒక్క స్ట్రాబెర్రీనే కాదు మిరియాలు, బార్లీ... గోధుమలు అబ్బో ఆ జాబితా చాంతాండంత. అతను చేసిన ప్రయోగాలు లెక్కలేనన్ని. నిజం చెప్పాలంటే సాగుబడి పాఠాలు చెప్పే బడికి అతను ప్రిన్సిపల్‌లాంటోడు. అబ్బో ఇన్ని ప్రయోగాలు చేస్తున్నారు అంటే బాగా చదువుకున్నోడు అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఆయన చదువు పదోతరగతి మాత్రమే. కానీ మట్టి మనసుని చదవడంలో మాత్రం పీహెచ్‌డీ చేశారు. అందుకే అతను పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు సాధించలేని విజయాలు కూడా అవలీలగా సాధించారు. కొత్తపంటలు వేసి చేతులు కాల్చుకోవడం ఎందుకూ.. అంటూ తోటి రైతులు కుశలవుడుని ఎన్నిసార్లు హేళన చేసినా దానిని ఓ సవాల్‌గా తీసుకున్నారే కానీ... వెనకడుగు వేయలేదు. సాగులో సత్ఫలితాలు సాధించి అందరి మన్ననలూ పొందుతున్నారు.
కొత్తపంటల పరిచయం...
విశాఖజిల్లాలోని చింతపల్లి మండలం గొందిపాకల కుశలవుడి సొంతూరు. అతనికున్నది మన్యం భూమి. అతను పండించే నేల సారవంతమైన భూమి ఏమాత్రం కాదు. ఒక వేళ దాన్ని సానుకూలంగా మార్చుకున్నా ఆ అటవిలో సాగు మెలకువలు చెప్పేవారి జాడ లేదు. అలాంటి నేలలో కళ్లు చెదిరే స్ట్రాబెర్రీలు వేసి గులాబీరంగు బంగారం పండించి చూపించారు. ఆ ఒక్కటే అతను చేసిన అద్భుతం కాదు. ఇంకా అనేకం ఉన్నాయి. స్ట్రాబెర్రీ అనగానే అది విదేశీపంటేమో అనుకుంటాం. అది వాస్తవం కూడా. శీతల ప్రాంతాల్లో మాత్రమే పండే ఈ పండుని మనం కూడా పండించగలం అని నిరూపించారు. విశాఖలోని తన స్నేహితుడి సాయంతో పదేళ్ల క్రితం రెండెకరాల పొలంలో తొలిసారిగా స్ట్రాబెర్రీని ప్రయోగాత్మకంగా పండించారు. ఈ పంటకు సుమారు లక్షరూపాయల వరకూ పెట్టుబడిగా పెట్టారు. కానీ లాభం రాలేదు. కారణం.. కొత్తపంట కదా... తెలిసినవాళ్లు, పరిచయస్తులు, రుచి చూస్తామంటూ తలాకొన్ని పండ్లు పట్టుకుపోవడంతో ఆశించిన లాభాలురాలేదు. ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఒక్కసారితో ఆపేయకుండా వరుసగా స్ట్రాబెర్రీ సాగు చేపడుతూ లాభాలు వచ్చేంతవరకూ శ్రమించారు. బార్లీ, గోధుమ, ఆవాలు వంటి సంప్రదాయేతర పంటలు వేసి తనేంటో నిరూపించుకున్నారు. కాఫీ, మిరియాలు, బొప్పాయి, అరటి, పాలూరు పనస, బర్మా కొత్తిమీర వంటి ఉద్యాన, సుగంధ ద్రవ్య పంటలను సాగుచేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మొదట్లో తనకున్న ఐదెకరాల పొలంలోనే పరిమితంగా కొత్తరకాల పంటలను సాగుచేయడం ప్రారంభించారాయన. వ్యవసాయం పట్ల అతనికున్న ప్రేమని చింతపల్లి వ్యవసాయాధికారి రవీంద్రనాథ్‌ చూసి ముచ్చటపడ్డారు. చింతపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానంలో జరుగుతున్న రైతు శిక్షణ తరగతులకు కుశలవుడుని ఆహ్వానించారు. ఆ పిలుపు కుశలవుని జీవితాన్ని మలుపు తిప్పింది. వ్యవసాయం పట్ల ఇతనికున్న ప్రేమను గమనించిన వ్యవసాయాధికారులు ఆదర్శ రైతుగా అవకాశం కల్పించి.. పరిశోధన, విస్తరణ సలహా మండలి సభ్యుడిగా అవకాశం ఇచ్చారు. .
సేంద్రియం అతని మంత్రం...
కుశలవుడు తనకున్న అటవీ భూమిలో కాఫీతోటలను సాగుచేశాడు. అప్పటికే గిరిజనులంతా కాఫీతోటల్లో అధిక దిగుబడుల కోసమని రసాయనిక ఎరువుల వినియోగానికి అలవాటు పడ్డారు. కానీ కుశమాత్రం పూర్తిగా సేంద్రియ పద్దతిలో కాఫీసాగు చేపట్టి సత్ఫలితాలు సాధించారు. దీంతో కేంద్ర కాఫీ బోర్డు అధికారుల దృష్టిని ఆకర్షించాడు. అలా పదేళ్ల క్రితమే కేంద్ర కాఫీబోర్డు ప్రకటించిన అంతర్జాతీయ కాఫీ ఫైన్‌కప్‌ అవార్డుకు ఎంపికయ్యాడు. అతను ఇచ్చిన స్ఫూర్తి ఎంతో మంది రైతులని ఆకర్షించింది. దీంతో ఈప్రాంతానికి చెందిన రెండు వేల మంది గిరిజన రైతులతో కుశలవుడు గిరిజన గ్రామ స్వరాజ్య సంఘాన్ని స్థాపించారు. తొలిసారిగా సేంద్రియసాగు ధ్రువపత్రం పొందిన ఘనత కూడా గ్రామస్వరాజ్యసంఘానికే దక్కింది. మూడేళ్లపాటు కాఫీని పూర్తిగా సేంద్రియ విధానంలో సాగు చేసినందుకు బెంగళూరులోని అదితి అనే  జాతీయ సంస్థ 2008లో గొందిపాకల గ్రామానికి ఆర్గానిక్‌ సర్టిఫికెట్‌ని జారీచేసింది.
శాస్త్రవేత్తలకూ కొత్త విత్తనాలు... 
సాధారణంగా ఏవైనా కొత్తపంటలను శాస్త్రవేత్తలు ముందుగా సాగుచేసి వాటి ఫలితాలను బాగున్నాయి అని నిర్థరించుకున్నాక అప్పుడు వాటిని రైతులకు పరిచయం చేస్తారు. కానీ ఇది కుశలవుని విషయంలో సీన్‌ రివర్స్‌ అయ్యింది. మహారాష్ట్రలోని పుణె నుంచీ బార్లీ విత్తనాలని తీసుకువచ్చి తన పొలంలో సాగు చేసి అవి మంచి ఫలితాలను ఇవ్వడంతో శాస్త్రవేత్తలకు వాటిని అందించారు. బిందు సేద్యం చేసి సేంద్రియ పద్ధతిలో కుశ పండించిన స్ట్రాబెర్రీలను ‘డ్యూడ్రాప్స్‌’ పేరుతో విక్రయించాడు. ఉద్యాన పంటల సాగులో అధ్భుతమైన ఫలితాలు సాధిస్తున్న కుశలవుడుని వెంకట రామన్న గూడెంలోని ఉద్యాన విశ్వవిద్యాలయం తమ పరిశోధన, విస్తరణ సలహామండలి సభ్యునిగా నియమించి గౌరవించింది. తనకు తెలిసిందే ప్రపంచం అనుకోకుండా తోటి రైతులు చేస్తున్న ప్రయోగాలుకూడా గమనించడం కుశలవుని ప్రత్యేకత. కేరళకు చెందిన టి.టి.థామస్‌ ‘పెప్పర్‌ డెక్కన్‌’ అనే మేలురకపు హైబ్రిడ్‌ మిరియాలను సొంతంగా అభివృద్థి పరిచారు. సాధారణంగా మిరియాలు ఒక్కో రెమ్మకు 60 నుంచీ 70 గింజలు కాస్తే.. థామస్‌ అభివృద్థి చేసిన మిరియాలు రెమ్మకు ఏకంగా వెయ్యి వరకూ కాస్తాయి. దీన్ని గుర్తించిన కేరళ ప్రభుత్వం అతన్ని ఉత్తమరైతుగా గుర్తించింది. ఈ విషయాన్ని అంతర్జాలం ద్వారా తెలుసుకున్న కుశలవుడు థామస్‌ని కలిసి ఆ మిరియాలను వెంట తీసుకువచ్చి స్థానికంగా సాగు చేశారు.

0 comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.